జస్టిస్ లోథా కమిటీ సిఫార్సు లను ఐపీఎల్ కు కూడా వర్తింపజేయాలి:
హెచ్ సీఏ బోర్డ్ అవినీతి అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీ నియమించి విచారణ జరపాలి:
హైదరాబాద్ క్రికెట్ అభిమానులకు నిరాశ కలిగిస్తున్న హెచ్ సీఏ బోర్డ్ నిర్ణయాలు:
మ్యాచ్ టికెట్లను కౌంటర్లను ఏర్పాటు చేసి అందించాలి,లేకుంటే 25వ తేదీన జరిగే మ్యాచ్ ను అడ్డుకుంటాం
ఏ ఐ వై ఎఫ్ రాష్ట్ర సమితి డిమాండ్
బ్లాక్ లో ఐపీఎల్ క్రికెట్ టికెట్స్ అమ్ముకుంటున్న హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ బోర్డ్ (హెచ్ సీఏ), సన్ రైజర్స్ యాజమాన్యాలపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, హెచ్ సీఏ బోర్డ్ అవినీతి అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీ నియమించి విచారణ జరపాలని, జస్టిస్ లోథా కమిటీ సిఫార్సు లను ఐపీఎల్ కు కూడా వర్తింపజేయాలని అఖిల భారత యువజన సమాఖ్య (ఏ ఐ వై ఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి కె. ధర్మేంద్ర,రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నెర్లకంటి శ్రీకాంత్ డిమాండ్ చేశారు. ఏ ఐ వై ఎఫ్ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో కార్యాలయంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ గేటు వద్ద ప్లకార్డులు చేతబూని హెచ్ సీఏ, సన్ రైజర్స్ తీరును ఖండిస్తూ ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ధర్మేంద్ర, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నెర్లకంటి శ్రీకాంత్ లు సంయుక్తంగా మాట్లాడుతూ హైదరాబాద్ క్రీడా అభిమానులకు మరోసారి నిరాశే ఎదురైందని, హైదరాబాద్ లోని ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగే ఐపీఎల్ మ్యాచ్లకు సంబంధించిన టికెట్ల విక్ర యాల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయని అన్నారు. ఉప్పల్ స్టేడియంలో ఈ నెల 25 సన్ రైజర్స్ హైదరాబాద్- రాయల్ ఛాలెంజర్స్ జట్ల మధ్య ఐపీఎల్ మ్యాచ్ జరగాల్సి ఉందని, ఈ మ్యాచ్ కు సంబంధించిన టికెట్లను శుక్రవారం విక్రయానికి పెట్టారని, అయితే టికెట్లను పేటిఎంలో అమ్మకానికి పెట్టిన క్షణాల్లోనే టికెట్లను అమ్ముడు పోయాయంటూ బోర్డ్ ప్రకటించారని. దాదాపు 36 వేలకు పైగా టికెట్లను అమ్మకానికి పెట్టిన అరగంట గంటలోపే ఏవిధంగా అమ్ముడుపోతాయో హెచ్ సీఏ, సన్ రైజర్స్ యాజమాన్యాలు రాష్ట్ర ప్రజలకు స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఇంతకుముందు ఉప్పల్ వేదికగా ముంబై, చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ల సందర్భంగా కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైందని ఆరోపించారు. అమ్మకాలు ప్రారంభించిన కొన్ని క్షణాల్లోనే టికెట్లను అమ్ముడు పోయాయని నిర్వాహకులు చేసిన ప్రకటన పూర్తి అర్థ రహితమని, హెచ్ సీఏ, సన్ రైజర్స్ యాజమాన్యాలు టికెట్లను బ్లాక్ లో అమ్ముకుంటున్నారని ధ్వజమెత్తారు. కాగా, ఐపీఎల్ టికెట్ల విక్రయానికి సంబంధించిన ఐపిఎల్ ఫ్రాంచైజీ సన్ రైజర్స్ తో పాటు హైదరాబాద్ క్రికెట్ సంఘం ప్రతినిధులు వ్యవహరిస్తున్న తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయన్నారు. ఏ నగరంలో లేని విధంగా ఒక్క హైదరాబాద్ లోనే ఇలాంటి పరిస్థితి ఉందని, ఐపీఎల్ కు ఆతిథ్యం ఇస్తున్న ఇతర వేదికల్లో టికెట్ల అమ్మకాల్లో పారదర్శకత కనిపిస్తుందని వారు అన్నారు. హైదరాబాద్లో ఏ మ్యాచ్ జరిగినా టికెట్లను బ్లాక్లో అమ్ముకోవడం కార్పొరేట్ వ్యాపారంగా మారిందని, ఎన్ని పాలక కమిటీలు మారినా పరిస్థితుల్లో ఎలాంటి మార్పులు రాలేదని వారు ధ్వజమెత్తారు.టికెట్లను బ్లాక్ లో ప్రైవేట్ వ్యక్తులు అమ్ముకుంటున్నారని బోర్డ్ అధికారులు ప్రకటనలు ఇస్తున్నారని, ఒకవేళ టికెట్ల విక్రయాల్లో బోర్డ్ పాత్ర లేదని, పెద్ద ఎత్తున అక్రమాలు జరగలేదని,హెచ్ సీ ఏ కు సంబంధం లేదని బోర్డ్ అధికార యంత్రాంగం చెప్పగలదా అని వారు ప్రశ్నించారు. హెచ్ సీఏ బోర్డ్, సన్ రైజర్స్ యాజమాన్యాల వికృత వ్యాపార క్రీడలో క్రీడా అభిమానులు నష్ట పోవాల్సిన అవసరం ఏమున్నదని, తక్షణమే బోర్డ్ టికెట్లకు సంబంధించిన వివరాలను పబ్లిక్ డొమైన్ లో పొందుపరచాలని, జవాబుదారీతనంగా ఉండాలని లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా క్రీడా వ్యాపారంపై పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని వారు హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఏ ఐ వై ఎఫ్ రాష్ట్ర నేతలు గిరి బాబు,కళ్యాణ్, శ్రీకాంత్, అజీమ్,అనీల్, సమీర్, నదీమ్, ఇంతియాజ్, వంశీ, అరుణ్, మహేష్ తదితరులు పాల్గొన్నారు