క్రీడల ద్వారా పోలీసులలో సమిష్టితత్వం పెరుగుతుంది: హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ జితేందర్, ఐపీఎస్
సిబ్బంది రెట్టించిన ఉత్సాహంతో సమర్థవంతంగా పనిచేయాలి: సీపీ సుధీర్ బాబు ఐపీఎస్
ఘనంగా ముగిసిన రాచకొండ కమిషనరేట్ ఐదవ వార్షిక స్పోర్ట్స్ మీట్-2024 పోటీలు
సరూర్ నగర్ లోని ఇండోర్ స్టేడియంలో మూడు రోజుల పాటు జరిగిన ఐదవ రాచకొండ పోలీస్ కమిషనరేట్ వార్షిక స్పోర్ట్స్ మీట్-2024 క్రీడా పోటీలు ఈరోజు ఘనంగా ముగిశాయి. ఈ ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ జితేందర్ ఐపీఎస్ మాట్లాడుతూ.. క్రీడలు వ్యక్తుల మానసిక శారీరక ఉల్లాసానికి ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. పోలీసు ఉద్యోగం ఎన్నో సవాళ్లలతో కూడుకున్నదని తమ కర్తవ్య నిర్వహణలో భాగంగా రేయింబవళ్లు పనిచేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఈ క్రీడా పోటీల నిర్వహణ ద్వారా పోలీసులు రెట్టించిన ఉత్సాహంతో పనిచేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ శాంతిభద్రతల నిర్వహణలో మరియు నేర నియంత్రణలో జాతీయ స్థాయిలో అగ్రస్థానంలో ఉందని మరింత అంకిత భావంతో పనిచేస్తూ ఆ మంచిపేరును కొనసాగించాలని సూచించారు.
ఈ ముగింపు వేడుకలలో రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు మాట్లాడుతూ.. మూడు రోజులపాటు సాగిన రాచకొండ పోలీస్ కమిషనరేట్ స్పోర్ట్స్ మీట్ లో పాల్గొన్న అన్ని జట్లను మరియు విజేతలను అభినందించారు. తమ విధి నిర్వహణలో భాగంగా ఎన్నో రకాల ఒత్తిళ్లను ఎదుర్కొంటూ సమర్థవంతంగా శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తున్న పోలీసులకు మానసికోల్లాసాన్ని అందించే లక్ష్యంతో ఈ రాచకొండ పోలీస్ స్పోర్ట్స్ మీట్ నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. రాచకొండ అన్ని జోన్లు మరియు వివిధ పోలీసు విభాగాల నుంచి మొత్తం ఎనిమిది జట్లు క్రికెట్, వాలీ బాల్, ఫుట్ బాల్, రన్నింగ్, చెస్, బ్యాడ్మింటన్ వంటి పలు రకాల ఇండోర్ మరియు ఔట్ డోర్ క్రీడా పోటీలలో పాల్గొన్నారని తెలిపారు. ఈ సారి రాచకొండ కమిషనరేట్ మినిస్టీరియల్ సిబ్బంది కూడా ఉత్సాహంగా ఈ క్రీడా పోటీలలో పాల్గొన్నారని తెలిపారు. శాంతిభద్రతల నిర్వహణలో సిబ్బందికి నాయకత్వం వహించడంతోపాటు వారి సంక్షేమానికి కూడా అధిక ప్రాధాన్యం ఇస్తామని ఈ సందర్భంగా ప్రత్యేకంగా పేర్కొన్నారు. క్రీడా పోటీలలో పొందిన ఆనందంతో సిబ్బంది మరింత ఉత్సాహంతో మరింత సమర్థవంతంగా పని చేయాలని కమిషనర్ సూచించారు. ఈ కార్యక్రమంలో యాదాద్రి డిసిపి రాజేష్ చంద్ర ఐపిఎస్, మల్కాజిగిరి డిసిపి పద్మజ ఐపీఎస్, ఎస్ఓటీ డిసిపి గిరిధర్ ఐపీఎస్, ఎల్బీనగర్ డిసిపి ప్రవీణ్ కుమార్ ఐపిఎస్, మహేశ్వరం డిసిపి సునీత రెడ్డి, ఎస్ఓటీ మురళీధర్, డిసిపి అడ్మిన్ ఇందిర, అదనపు డిసిపిలు, ఏసీపీలు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.