నేర నియంత్రణకు అవసరమైన చర్యలు
వృద్ధులు, మహిళల పట్ల నేరాలకు పాల్పడే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలి.
ఎన్నికల విధుల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలి: రాచకొండ కమిషనర్ తరుణ్ జోషి ఐ.పి.ఎస్
రాచకొండ కమిషనర్ తరుణ్ జోషి ఐ.పి.ఎస్ యాదాద్రి జోన్ డీసీపీ, అదనపు డీసీపీలు, ఏసిపిలు, ఇన్స్పెక్టర్లు మరియు ఇతర అధికారులతో ఈ రోజు భువనగిరి కలెక్టరేట్ లో క్రైమ్ రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో యాదాద్రి జోన్ లోని వివిధ స్టేషన్లలో నమోదైన పోక్సో కేసులు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు, పెండింగ్ గ్రేవ్ కేసుల విచారణ, మరియు ఇతర కేసుల విచారణ పురోగతి మీద సమీక్ష నిర్వహించారు.
ఈ సమావేశంలో కమిషనర్ మాట్లాడుతూ యాదాద్రి జోన్ పరిధిలో జరిగే నేరాలను అదుపులో ఉంచాలని, నేర నియంత్రణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని, ఫిర్యాదు చేయడానికి వచ్చే బాధితులతో స్నేహపూర్వకంగా వ్యవహరించాలని, వారి బాధలను ఓపికగా విని తగిన న్యాయం చేయాలని సూచించారు.
ఈ సమావేశంలో ఎన్నికల నిబంధనలకు సంబంధించి ప్రతి అంశంపై అధికారులు మరియు సిబ్బందికి ఉన్న పరిజ్ఞానాన్ని సమీక్షించారు. కమిషనర్ మాట్లాడుతూ.. రానున్న లోక్ సభ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించడానికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని, ఎన్నికల నిబంధనలకు సంబంధించి చట్టాలు, సెక్షన్ల మీద అధికారులు మరియు సిబ్బంది సంపూర్ణ పరిజ్ఞానం కలిగి ఉండాలని సూచించారు. క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తించే కిందిస్థాయి సిబ్బందికి కూడా ఎన్నికల నిబంధనల మీద పరిజ్ఞానాన్ని, అవగాహనను కల్పించడానికి సిబ్బందికి పలు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించామని పేర్కొన్నారు. ఎన్నికల విధులకు సంబంధించిన నిర్దిష్టమైన సూచనలను తమ కింది స్థాయి సిబ్బందికి అందించాలని అధికారులకు సూచించారు. యాదాద్రి జోన్ పరిధిలో ఎనిమిది స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ ఏర్పాటు చేశామని, అక్రమంగా తరలిస్తున్న డబ్బు, మద్యం, ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే ఇతర నిషేధిత వస్తువులను పట్టుకోవడానికి అవసరమైన చోట్ల మరిన్ని చెక్ పోస్టులను ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా కమిషనర్ సూచించారు. విజిబుల్ పోలీసింగ్ కు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. అధికారులు సంబంధిత పోలీస్ స్టేషన్ పరిధిలోని పోలింగ్ కేంద్రాలపై పూర్తిగా అవగాహన కలిగి ఉండి, ఎన్నికల నిర్వహణలో క్రిటికల్ పోలింగ్ కేంద్రాలు, వల్నరబుల్ పోలింగ్ ప్రాంతాల గుర్తింపు పట్ల స్పష్టతతో ఉండాలని సూచించారు.
ఈ సమీక్షా సమావేశంలో యాదాద్రి జోన్ లోని ఆయా స్టేషన్ల సిబ్బంది యొక్క పనితీరు గురించి తెలుసుకున్నారు. వృద్ధులు, మహిళల పట్ల నేరాలకు పాల్పడే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు, వారి ఫిర్యాదులకు తక్షణమే స్పందించి సత్వర న్యాయం చేకూర్చాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి డీసీపీ రాజేశ్ చంద్ర ఐపిఎస్, అడిషనల్ డీసీపీలు, ఎసిపిలు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు