లోక్ సభ ఎన్నికల నోడల్ అధికారులతో సమీక్షా సమావేశంలో రాచకొండ కమిషనర్
త్వరలో జరగనున్న లోక్ సభ ఎన్నికలను పురస్కరించుకొని క్షేత్రస్థాయిలో చేపట్టవలసిన భద్రత ఏర్పాట్లను మరియు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ఈరోజు రాచకొండ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి ఐపిఎస్ రాచకొండ నోడల్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది.
ఈ సమావేశంలో కమిషనర్ మాట్లాడుతూ.. లోక్ సభ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక ఏసిపి నోడల్ అధికారిగా వ్యవహరించాల్సి ఉంటుంది కాబట్టి ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు పార్టీల బహిరంగ సమావేశాలు, ర్యాలీలు వంటి అన్ని అనుమతులను జాగ్రత్తగా జారీ చేయాలని, ఎటువంటి పొరపాట్లు జరగకుండా చూసుకోవాలని రాచకొండ సీపీ అన్నారు. ఎన్నికల ర్యాలీలకు అనుమతించే విషయంలో నిబంధనలు ఖచ్చితంగా పాటించేలా చూడాలన్నారు. ఎన్నికల నిబంధనలకు సంబంధించి చట్టాలు, సెక్షన్ల మీద అధికారులు మరియు సిబ్బంది సంపూర్ణ పరిజ్ఞానం కలిగి ఉండాలని సూచించారు. ఎన్నికల విధులకు సంబంధించిన నిర్దిష్టమైన సూచనలను తమ కింది స్థాయి సిబ్బందికి అందించాలని, క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తించే కిందిస్థాయి సిబ్బందికి కూడా ఎన్నికల నిబంధనల మీద పరిజ్ఞానాన్ని, అవగాహనను కల్పించడానికి సిబ్బందితో శిక్షణా సమావేశాలను ఏర్పాటు చేసుకోవాలని పేర్కొన్నారు.
రాచకొండ పరిధిలో అక్రమంగా తరలిస్తున్న డబ్బును పట్టుకోవడానికి అవసరమైన చోట్ల చెక్ పోస్టులను ఏర్పాటు చేసి, పకడ్బందీగా తనిఖీలు నిర్వహించాలని సూచించారు. పార్టీల ఊరేగింపు, ప్రచారం వంటి కార్యక్రమాల్లో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసే వారిని, వివిధ వర్గాల మధ్య చిచ్చు పెట్టేలా ఉద్దేశ పూర్వక వ్యాఖ్యలు చేసే వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గత ఎలక్షన్స్ సమయంలో సమస్యలను సృష్టించిన వారిపై పూర్తి నిఘా ఉంచాలని, రౌడీ షీటర్స్ ను, సస్పెక్ట్ షీట్ ఉన్నవారిని, హిస్టరీ షీట్ ఉన్నవారిని బైండోవర్ చేయాలని తెలిపారు. ఎన్నికల సమయంలో లా అండ్ ఆర్డర్ సమస్య, గొడవలు సృష్టంచే అవకాశం ఉన్న సోషల్ మీడియా సందేశాలు, వీడియోలు వైరల్ చేసే విషయాలు, చిన్న విషయాలైనా ఉన్నత అధికారులకు సమాచారం అందించాలని, సిబ్బంది ఎల్లప్పుడూ అలర్ట్ గా ఉండేలా చూడాలని, సమస్యాత్మక గ్రామాలను విధిగా పర్యటిస్తూ అట్టి గ్రామాలపై దృష్టిసారించాలని తెలిపారు. విజిబుల్ పోలీసింగ్ కు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. తమ పరిధిలో ఉన్న పెండింగ్ ఎస్సి ఎస్టీ అట్రాసిటీ కేసులు మరియు పొక్సో కేసులను త్వరగా విచారించి దర్యాప్తు పూర్తి చేయాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో మల్కాజిగిరి డీసీపీ పద్మజ ఐపిఎస్, ఎస్బి డీసీపీ కరుణాకర్, ఎలక్షన్ సెల్ అడిషనల్ డీసీపీ శ్రీనివాస్, వివిధ జోన్ల నోడల్ ఏసిపిలు, ఐటి సెల్ ఏసిపి నరేందర్ గౌడ్, ఏసిపి ఎస్బి శ్రీధర్ రెడ్డి, మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.