నేటి డిజిటల్ యుగంలో సమాచారం వేగంగా వ్యాప్తి చెందుతోంది. వేగవంతమైన సమాచారం ఎంతో ఉపయోగకరమైనది అయినప్పటికీ, ఇది సమాజానికి సవాల్‌గా మారింది. ముఖ్యంగా ఎన్నికల సమయంలో మరింతా ఆందోళనకరంగా మారింది. తప్పుడు సమాచారం, తప్పుడు వార్తలు.. ప్రజాస్వామ్య పునాదులను పెకిలిస్తాయని మేధావులు ఆందోళన చెందుతున్న తరుణమిది. సోషల్ మీడియా, ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ల పెరుగుదలతో, తప్పుడు సమాచారం కూడా వ్యాపిస్తోంది. దీంతో గందరగోళానికి, అపనమ్మకానికి, సామాజిక నష్టానికి దారి తీస్తున్న పరిస్థితి నెలకొంది.
సోషల్ మీడియా, ఆన్‌లైన్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల వినియోగం విస్తృతమైన తర్వాత సమాచారం శరవేగంగా అందరికీ చేరిపోతుంది. ఇందులో పెద్దఎత్తున తప్పుడు సమాచారమూ ఉంటోంది. ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకోవడం, రాజకీయ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు అనని మాటలు అన్నట్లు గందరగోళం సృష్టించడం సాధారణమైపోయింది. మతవిద్వేషాలు రెచ్చగొట్టేలా తప్పుడు సమాచారాన్ని సామాజిక మాధ్యమాల వేదికగా ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి తప్పుడు సమాచారం శాంతిభద్రతలకు తీవ్ర విఘాతం కలిగిస్తున్న సందర్భాలూ ఉన్నాయి.
భారత్, అమెరికా, బ్రిటన్, మెక్సికో సహా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఈ ఏడాది ఎన్నికలు జరుగనున్నాయి. దాదాపు 300 కోట్ల మంది ఎన్నికల క్రతువులో భాగం కానున్నారు. అయితే తప్పుడు సమాచార వ్యాప్తి ఎన్నికలకు పెను ముప్పుగా పరిణమించిందని, ఆయా దేశాల్లో ఎన్నికల ఫలితాలపైనా, ప్రజాస్వామ్య మనుగడపైనా ఇది తీవ్ర ప్రభావం చూపించనున్నదని ప్రపంచ ఆర్థిక వేదిక(డబ్ల్యూఈఎఫ్) గ్లోబల్ రిస్క్ నివేదిక-2024 ఆందోళన వ్యక్తం చేసింది. ఆర్థిక, పర్యావరణ, రాజకీయ, భౌగోళిక, సాంకేతిక తదితర 34 ముప్పులపై నివేదిక ర్యాంకులను ప్రకటించింది. తప్పుడు సమాచారం అతిపెద్ద ముప్పుగా ఉన్న దేశాల్లో భారత్ తొలిస్థానంలో ఉన్నది. అమెరికా ఆరో స్థానంలో ఉన్నది.
ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగి, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశం సమాచార మార్పిడితో అభివృద్ధి చెందుతోంది. కానీ, ఈ నకిలీ వార్తల వ్యాప్తి బెడద తీవ్రంగానే ఉంది. రాయిటర్స్ ఇన్స్టిట్యూట్ నివేదిక ప్రకారం 73% భారతీయులు కనీసం వారానికోసారి ఆన్‌లైన్‌లో నకిలీ వార్తలను ఎదుర్కొంటున్నారు. ఈ కల్పిత కంటెంట్, తరచుగా చట్టబద్ధమైన వార్తల మాదిరిగానే కనిపిస్తూ మారువేషంలో ఉంటుంది. ఇది సామాజిక సామరస్యం నుండి రాజకీయ సంభాషణ వరకు ప్రతిదానిపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది.
అంతర్జాలం వేదికగా జరుగుతున్న అడ్డగోలు ప్రచారాలకు చెక్ పెట్టేందుకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం
చర్యలు చేపట్టింది. తప్పుడు వార్తలతో విద్వేషాలు రెచ్చగొట్టడం, అంతర్గత భద్రతకు ముప్పు కలిగించే
సమాచారాన్ని వ్యాప్తి చేయడం వంటి వాటిని అరికట్టడంపై దృష్టిపెట్టింది. ఇలాంటి సమాచారం ఎక్కడుందో గుర్తించి, దాన్ని తొలగించేలా సదరు సంస్థను ఆదేశించే అధికారాన్ని భారత సైబర్ నేరాల సమన్వయ కేంద్రం (ఐ4సీ)కి కట్టబెట్టింది. ఈమేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఇటీవల ఉత్తర్వులు జారీచేసింది. దీంతో ఇకపై ఏదైనా తప్పుడు సమాచారం అంతర్జాలంలో చెలామణి అవుతుంటే తక్షణమే దాన్ని తొలగించే అవకాశం ఉంటుంది.
తప్పుడు సమాచారాన్ని గుర్తించడం, దాన్ని తొలగించేలా సంబంధిత సంస్థను ఆదేశించడం స్థానిక యంత్రాంగానికి సవాలుగా మారింది. ఉదాహరణకు హైదరాబాద్‌లో మత విద్వేషాలు రెచ్చ గొట్టేలా ఏదైనా సందేశం ప్రసారం అవుతుందని ఎవరైనా గుర్తిస్తే, పోలీసులు దానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడతారు. ఈ సమాచారం ఎక్కడ నుంచి వచ్చిందో, దాని మూలం ఎక్క డుందో తెలుసుకోవడానికే చాలా సమయం పడుతోంది. ఇలాంటి సందర్భాల్లో ఆయా సంస్థలకు లేఖ రాసే అధికారం కేంద్ర ఎలక్ట్రానిక్ అండ్ ఇన్ఫర్మేషన్ శాఖకు మాత్రమే ఉంటుంది. స్థానిక పోలీసులు సంబంధిత సంస్థకు లేఖ రాసినా ఉపయోగం ఉండడం లేదు. స్థానిక పోలీసులు సమాచార శాఖకు తెలియజేసి.. ఆ శాఖ అధికారులు సంబంధిత సంస్థను చర్యలకు అదేశించే లోగా సదరు తప్పుడు సమాచారం జనాల్లోకి వెళ్లి తీవ్ర నష్టం చేస్తోంది. ఇటువంటి సందర్భాల్లో ఆలస్యాన్ని నివారించి, తప్పుడు సమాచారాన్ని సత్వరమే తొలగించేలా చూసేందుకు కేంద్ర హోం మం త్రిత్వ శాఖ ‘ఐ4సీ’ని నోడల్ ఏజెన్సీగా గుర్తించింది. స్థానిక దర్యాప్తు సంస్థలు ఏవైనా తప్పుడు లేదా హానికరమైన సమాచారం వ్యాప్తి జరుగుతోందని గుర్తిస్తే అదే విషయాన్ని ‘ఐ4సీ’ చెప్పాల్సి ఉంటుంది. అది ఎక్కడ పుట్టింది, ఎలా వ్యాప్తి చెందుతుందో ‘ఐ4సీ’ గుర్తిస్తుంది. దాన్ని వెంటనే తొలగించాలని సదరు సంస్థను ఆదేశిస్తుంది. ఇలా అదేశించే అధికారాన్ని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కొత్తగా ‘ఐ4సీ’కి కట్టబెట్టింది. దీంతో తప్పు డు సమాచారాన్ని గుర్తించి, తొలగించడం సులభమవుతుంది. ఇలాంటి సమాచారం వల్ల జరిగే నష్టాన్ని నివారించే అవకాశం ఏర్పడుతుంది.
సోషల్ మీడియాలో వచ్చే సమాచారానికి ఉన్న ప్రామాణికత తెలియనంత వరకు ఇతరులకు షేర్ చేయకూడదు. తప్పు సమాచారం వ్యాప్తి చేయడం వల్ల సమాజంలో ఎన్నో ఉపద్రవాలను ఎదుర్కోవాల్సి వస్తుందని గ్రహించాలి. కొన్ని సందర్భాల్లో శాంతిభద్రతలకు భంగం కలిగి, హింసాత్మక ఘటనలు చెలరేగే అవకాశం ఉంటుంది.
నకిలీ వార్తలు భారతదేశం వంటి ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి గణనీయమైన ముప్పును కలిగిస్తాయి. దీంతో మన సమాజం గణనీయమైన సవాళ్లను ఎదుర్కొవాల్సి ఉంటుంది, అయితే ఇది అధిగమించలేని సమస్య కాదు. వాస్తవ-తనిఖీ కార్యక్రమాలకు ప్రతి ఒక్కరూ మద్దతు ఇవ్వాలి. ఒకటికి రెండు సార్లు మంచి చెడులను, నిజానిజాలను విచక్షణతో ఆలోచించాలి. భిన్నాభిప్రాయలను గౌరవించే సంస్కృతిని అలవర్చుకోవాలి. ఉన్నది ఉన్నగా చెప్పే సంస్కారాన్ని పెంచుకోవాలి. అవగాహన పెంచుకుని తప్పుడు సమాచారాన్ని అరికట్టవచ్చు.
- స్వామి ముద్దం
వైస్ ప్రెసిడెంట్, తెలంగాణ జర్నలిస్టుల ఫోరమ్,