
అవినీతి, అసమర్థ ఎమ్మెల్యేని ఓడించి… దేవరకద్ర నియోజకవర్గాన్ని కాపాడుకుందామని బిసి పొలిటికల్ జెఎసి చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు..
ఆదివారం పట్టణంలోని బిపిఆర్ గార్డెన్లో బిసి పొలిటికల్ జెఎసి ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా రాచాల మాట్లాడుతూ రాష్ట్రంలోనే అత్యంత అసమర్థుడు, అవినీతిపరుడు దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి అని, స్వంత ఆస్తులు పెంచుకోవటం తప్ప నియోకవర్గ ప్రజలకు చేసిందేమీ లేదన్నారు.
గడిచిన తొమ్మిదేళ్ళలో విద్య మరియు వైద్యంపై కనీస దృష్టి పెట్టలేదని, కానాయపల్లి శంకర సముద్రం భూ నిర్వాసితుల సమస్యలు గానీ, ఊక చెట్టు వాగులపై బ్రిడ్జి నిర్మాణాలు, రోడ్ల విస్తరణలు ,మినీ స్టేడియం తదితర సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించారని ఆరోపించారు.
పదేళ్లుగా బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, లీడర్లు తప్ప ప్రజలు ఎవరు బాగుపడలేదని, కర్వెన ప్రాజెక్టు కాంట్రాక్టు,ఇసుక, మట్టిదందా, భూకబ్జాలు తప్ప నియోజకవర్గానికి చేసిందేమీలేదన్నారు .
జర్నలిస్టులకు ఇచ్చిన హామీ ప్రకారం డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టించి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
రెండు సార్లు గెలిచి అభివృద్ధి చేయనటువంటి ఎమ్మెల్యేని ఇంటికి సాగనంపాల్సిన సమయం ఆసన్నమైందని, పార్టీలకతీతంగా ప్రతి ఒక్కరూ ఏకం అవ్వాల్సిన సందర్భం వచ్చిందన్నారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే ఎన్నికల్లో ఓడించి తీరతామని హెచ్చరించారు.
ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్న బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించటానికి ఎలా ముందుకెళ్లాలి అనే అంశంపై విస్తృత ప్రజాభిప్రాయ సేకరణ జరుపుతున్నామని, రెండ్రోజుల్లో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని ఆయన తెలిపారు.
ఈకార్యక్రమంలో బీసీ పొలిటికల్ జెఎసి అంజన్న యాదవ్, మహిందర్ నాయుడు, తిరుపతయ్య గౌడ్, నగేష్, తోకల రవి, శంకర్, వెంకటేష్, అనుదీప్, సునీల్ , హరి, చెన్నయ్య తదతరులు పాల్గొన్నారు.