హనుమాన్ విగ్రహ నిర్మాణ సమితి, బజరంగ్దళ్ కుషాయిగూడ సంయుక్త ఆధ్వర్యంలో కుషాయిగూడ బస్ స్టాప్ వద్ద నిర్మించ తలపెట్టిన భారీ హనుమాన్ విగ్రహ భూమి పూజ, శంకుస్థాపన కార్యక్రమం ఆదివారం ఉదయం అత్యంత భక్తి శ్రద్ధలతో, ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పూజ మహోత్సవాల్లో స్థానిక శాసనసభ్యులు బండారి లక్ష్మారెడ్డి, మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్, స్థానిక కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తదితరులు పాల్గొని పూజలు నిర్వహించారు. ముందుగా హనుమాన్ విగ్రహ నిర్మాణ సమితి, బజరంగ్దళ్ కార్యకర్తలు కుషాయిగూడ శివాంజనేయ స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, శంకుస్థాపన పూజా సామాగ్రిని భాజా భజంత్రీ వాయిద్యాల నడుమ బస్ స్టాప్ లోని హనుమాన్ గద్దె వరకు శోభాయాత్ర నిర్వహించారు. అనంతరం గోవు పూజ నిర్వహించి గోమాతకు వస్త్రం సమర్పించారు. ఈ సందర్భంగా పలువురు భక్తులు భారీ హనుమాన్ విగ్రహ నిర్మాణానికి విరాళాలను అందజేశారు. అలాగే భక్తులకు ప్రసాదాన్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ సింగిరెడ్డి ధన్పాల్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ కాసుల రవీందర్ గౌడ్, గణేష్ ముదిరాజ్, కాసుల సురేందర్ గౌడ్, కంసాని సీతారాం రెడ్డి, సప్పిడి శ్రీనివాస్ రెడ్డి, హనుమాన్ నిర్మాణ సమితి కమిటీ సభ్యులు, కుషాయిగూడ గ్రామస్తులు, హనుమాన్ భక్తులు, తదితరులు పాల్గొన్నారు.