నాడు నిజం గెలవాలి కార్యక్రమంలో ప్రజల ఆవేదన చూశాను…బాధలు విన్నాను…ఇబ్బందులు తెలుసుకున్నాను. అణచివేతను అర్థం చేసుకున్నాను. నేను కోరుకున్నట్లుగానే అద్భుతమైన ప్రజాతీర్పుతో ప్రజా పాలన మొదలైంది. ఈ రోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా ప్రజలు తామే గెలిచామన్నంత సంతోషంలో ఉన్నారు. స్వేచ్ఛగా మాట్లాడుతున్నారు. తమ అభిప్రాయాలు చెప్పగలుగుతున్నారు. నాడు జరిగిన అన్యాయాలను నిర్భయంగా ప్రస్తావిస్తూ…తాము పడిన క్షోభపై గళం విప్పుతున్నారు. నాడు అశాంతితో బతికిన ప్రజల మనసులు నేడు తేలిక పడ్డాయి. మహిళలు తమ రక్షణపై, తల్లులు తమ బిడ్డల భవిష్యత్తు పై ధైర్యంగా ఉన్నారు. రాష్ట్ర ప్రజల ఆశలు మళ్లీ చిగురిస్తున్నాయి. ఇది నా మనసుకు ఎంతో సంతోషాన్నిచ్చింది. ఇక ప్రజలకు అంతా మంచే జరుగుతుంది. కూటమి ప్రభుత్వంలో…
చంద్రబాబు పాలనలో అమరావతి రాజధానిగా మళ్లీ గర్వంగా నిలబడుతుంది. రాజధాని రైతుల పోరాటాలు ఫలించి వారి జీవితాల్లో చీకట్లు తొలగిపోయాయి. చంద్రబాబు దీక్ష, పట్టుదలతో జీవనాడి పోలవరం సవాళ్లను, విధ్వంసాన్ని అధిగమించి ముందడుగు వేస్తుంది. 5 కోట్ల రాష్ట్ర ప్రజల భాగస్వామ్యంతో ప్రతి వర్గానికి, ప్రతి ప్రాంతానికి మంచి చేయాలనే చంద్రబాబు గారి సంకల్పం నెరవేరుతుంది. ప్రాణాలు పణంగా పెట్టి పనిచేసిన పార్టీ కార్యకర్తలకు గౌరవం దక్కుతుంది. ప్రజలే సుప్రీం అని చాటి చెప్పిన తిరుగులేని తీర్పుతో ఇక కౌరవ సభ స్థానంలో గౌరవ సభ కొలువుదీరుతుంది. ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చే బాధ్యత ప్రజా ప్రభుత్వం తీసుకుంటుందనే పూర్తి నమ్మకం నాకుంది.