కాప్రా రెవెన్యూ మండల పరిధిలోని చక్రిపురం హై టెన్షన్ లైన్ రోడ్లో సర్వేనెంబర్ 215 ప్రభుత్వ స్థలంలో అక్రమంగా రేకుల రూములు నిర్మిస్తున్నారు, గతంలో రెవెన్యూ అధికారులు ప్రభుత్వ స్థలంగా గుర్తించి సూచిక బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. అయినప్పటికీ కొంతమంది కాలనీ పెద్దలు, చోటా, మోటా నాయకుల అండదండలతో అక్రమార్కులు యదేచ్చగా రూములు నిర్మిస్తున్నారు. ఎన్నికల సమయాన్ని అదనుగా చూసుకొని అధికారులు బిజీగా ఉంటారని ఊహించి అక్రమాలకు పాల్పడుతున్నారు. ఇదే స్థలంలో గతంలో బోరు బావి వేయించారు, అనంతరం ప్రహరీ గోడ నిర్మించి, ఫర్నిచర్ షాపు నిర్వహించేందుకు ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. అధికారులు చర్యలు తీసుకున్నప్పటికీ ప్రస్తుతం మళ్ళీ అక్రమార్కులు ప్రభుత్వ స్థలంలో నిర్మాణాలు చేపడుతున్నారు. ప్రభుత్వ స్థలం అన్యాక్రాంతం కాకుండా రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవాలని, కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.