తెదేపా-జనసేన సమన్వయ కమిటీ సమావేశంలో పాల్గొన్న ప్రత్తిపాటి
జగన్ తాడేపల్లి ప్యాలెస్‌లో తెలుగుదేశం- జనసేన పొత్తు ఇప్పటికే ప్రకంపనలు సృష్టిస్తోందని, ఈ పట్టు సడలనీయొద్దు, ఓటు చీలనీయొద్దని ఇరు పార్టీల శ్రేణులు, నేతలకు మాజీమంత్రి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు పిలుపునిచ్చారు. రాబోతున్న ప్రభంజనం గురించి తెలిసే జగన్, వైకాపా కుట్రలు అమలు చేస్తున్నాయని, అలాంటి వాటి పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన తరుణమన్నారు. మార్చిలో నోటిఫికేషన్ అని ఇప్పటికే ఎన్నికల సంఘం ప్రకటించిన నేపథ్యంలో ఇకపై ఒక్కక్షణం కూడా వృథా చేయకుండా క్షేత్రస్థాయిలో ఇరుపార్టీలు పనిచేయాలని సూచించారు. ఉమ్మడి గుంటూరు జిల్లా తెదేపా-జనసేన సమన్వయ కమిటీ సమావేశం సందర్భంగా భవిష్యత్ కార్యాచరణపై ప్రత్తిపాటి పలు సూచనలు చేశారు. గుంటూరు తెదేపా జిల్లా కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో శాసనమండలి మాజీ ఛైర్మన్ ఎంఏ షరీఫ్(తెదేపా), ముత్తా శశిధర్(జనసేన) పరిశీలకులుగా హాజరయ్యారు. మాజీమంత్రి, తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావుతో పాటు తెదేపా నేతలు, జనసేన నేతలు పాల్గొన్నారు. ప్రజల్లోకి వెళ్లేందుకు అనుసరించాల్సిన ఉమ్మడి కార్యాచరణపై ఇరుపార్టీల నేతలు చర్చించారు. ఈ మేరకు ఇరు పార్టీల నాయకులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. నవంబరు 1వ తేదీ నుంచి బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా తెదేపా సూపర్ సిక్స్- జనసేన పార్టీ షణ్ముఖ వ్యూహాలతో సిద్ధం చేసిన ఉమ్మడి మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా ఏవైనా చిన్నచిన్న మనస్పర్థలున్నా పక్కనపెట్టి ముందుకెళ్లాలనే అభిప్రాయాన్నే ఇరుపార్టీల నాయకులు బలంగా వ్యక్తం చేశారు. నియోజకవర్గ, మండల, గ్రామస్థాయిలో రెండు పార్టీల నాయకులు కలిసి పనిచేసేలా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయడంతో పాటు, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు.