సెన్సార్ బోర్డులో అవినీతి జరిగినట్లుగా ఆరోపించిన నటుడు విశాల్ వ్యాఖ్యలపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఈ రోజు విచారణ జరపనున్నట్లు కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ తెలిపింది.
మార్క్ ఆంటోనీ సినిమా హిందీ వర్షన్ సెన్సార్ విషయమై తాను రూ.6.5 లక్షలు లంచం ఇవ్వవలసి వచ్చిందని విశాల్ గురువారం ట్వీట్ చేశారు. స్క్రీనింగ్ కోసం రూ.3.5 లక్షలు, సర్టిఫికెట్ కోసం రూ.3 లక్షలు ఇచ్చినట్లు తెలిపారు. మరోదారి లేక తాను డబ్బులు ఇవ్వవలసి వచ్చిందని, తాను ఈ అంశాన్ని ప్రధాని నరేంద్ర మోదీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే దృష్టికి తీసుకు వెళ్తానని చెప్పారు.
విశాల్ చేసిన ఆరోపణలు చాలా ముఖ్యమైనవి. అవినీతిని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. విశాల్ చేసిన ఆరోపణలపై సీరియస్‌గా దర్యాప్తు జరుపుతున్నట్లు కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఈ విచారణలో సెన్సార్ బోర్డుకు చెందిన అధికారులు, విశాల్‌తో పాటు సినిమా యూనిట్‌కు చెందిన ఇతర వ్యక్తులు కూడా విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. విచారణలో ఏవైనా ఆధారాలు లభిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.