Monday, December 23, 2024
- Advertisement -spot_img
- Advertisement -spot_img

ఒక”అన్నమ”య్య కథ

ఆయనది యాయావార వృత్తి. యాయావారం అంటే ఈ రోజు భాషలో చెప్పాలంటే అడుక్కోవడం.

ఇల్లిల్లూ తిరిగి అడుక్కునేవాడు. తాను తినేందుకు కాదు. ఇతరు లకు పెట్టేందుకు.

ఇతరులెవరు? ఇతరులంటే భక్తులు. ఎక్కడెక్కడినుంచో రామచంద్రస్వామిని చూసేందుకు వచ్చే భక్తులు.

ఆ రోజుల్లో భద్రాద్రి రామయ్యను చూడటమంటే మాటలా? బస్సులు, కార్లు, రైళ్లు లేని రోజులవి.అశ్వారావుపేట అడవులనో, పాల్వంచ అడవులనో దాటుకుని గోదారి అవతలి ఒడ్డుకు చేరాలి. అక్కడ నుంచి పడవలో విశాల గోదావరిని దాటిరావాలి.

అందుకే భద్రాద్రికి వచ్చే సరికి భక్తులు అలసిపోతారు. సొలసిపోతారు. ఆకలితో అలమటిస్తూంటారు.

ఒడ్డున దిగి స్నానం చేయగానే ఆవిరులు చిమ్మే వేడివేడి అన్నం, కమ్మనిపప్పు, కాసింత మజ్జిగ, అయితే గియితే ఒక అవకాయ బద్ద…. అది దొరికితే చాలు. ఆత్మారాముడు శాంతిస్తాడు. అప్పుడు అసలు రాముడిని ఆత్మశాంతితోచూడొచ్చు.

సరిగ్గా ఒడ్డుకి దగ్గరలో ఆయన అన్నం వండి పెట్టేవాడు. క్రమేపీ భక్త కోటికి ఈ సంగతి తెలిసింది. వచ్చేవారి సంఖ్య పెరిగింది. ఆయన కూడా వచ్చిన వారందరికీ లేదనకుండా అన్నం పెట్టేవాడు. ఈ రోజుల ఉడిపి హోటల్ కాదది. అంతా ఉచితమే.

ఒంటిపై ఒక చిన్న కౌపీనం తప్ప ఆయనకు ఇంకో ఆస్తి లేదు. రోజూ యాచించడం, తెచ్చింది వచ్చినవారికి వండి పెట్టడం. ఇదే అతని రామ సేవ. ఏదైనా రాముడే చూసుకుంటాడన్న ధీమా ఒక్కటే ఆయన సంపద.

 నిజంగా అంతా రాముడే చూసుకున్నాడు కూడా.

ఒక సారి వంటపాత్రలు చోరీ అయ్యాయి. వంట వాళ్లూ పారిపోయారు. సరిగ్గా భక్తులు వచ్చే సమయం. ఏం చేయాలో పాలుపోలేదు ఆయనకి. రామా లక్ష్మణా మీరే దిక్కు అనుకున్నాడు.

అంతలో ఇద్దరు కుర్రాళ్లు వచ్చారు. చేతుల్లో పెద్ద గుండిగలు (అన్నం వండే పెద్ద పాత్రలు). చకచకా అన్నం, పప్పూ వండేశారు. అందరికీ వడ్డించేశారు.

ఇంత రుచి ఇంతకుముందెన్నడూ చూడలేదు అన్నారు భక్తులు.

ఆయన వంటకుర్రాళ్లను చూసే సరికి వాళ్లు మాయమైపోయారు. కనుచూపుమేరలో కనిపించలేదు. ఎంత వెతికినా దొరకలేదు. గుండిగలు మాత్రం మిగిలిపోయాయి.

ఆయనకిఅర్థమైపోయింది. వచ్చినవాళ్లు అన్న రాముడు, తమ్ముడు లక్ష్మణుడు. అన్నం అంత రుచిగా ఎందుకుందో ఆయనకి తెలిసిపోయింది.

శ్రీరామ నీనామమేమి రుచిరా అనుకున్నాడు ఆయన.

భక్తులుపెరిగిపోతున్నారు. యాచించింది సరిపోవడం లేదు. రామా నీవే దిక్కు అనుకున్నాడు.

హఠాత్తుగా ఒక వాహనం వచ్చి సత్రం ముందు ఆగింది. అందులోనుంచి ఒక ధనవంతుడు దిగాడు.

అయ్యా… నాకు రాత్రి కల వచ్చింది. ఆ కలలో చనిపోయిన నా తల్లి కనిపించింది. మీ సత్రానికి నా భూములన్నిటినీ ఇచ్చేయమని చెప్పింది. నా నాలుగు వేల ఎకరాలు ఇదిగో మీకు రాసిచ్చేస్తున్నాను అని పత్రాలు ఇచ్చి వెళ్లిపోయాడు.

ఆయన ఒక పెద్ద వకీలు. హనుమకొండ ఆయన ఊరు. తుంగతుర్తి నరసింహారావు ఆయన పేరు.

 ఇక ఆ సత్రానికి ఏలోటూ లేదు. నాలుగువేల ఎకరాలూ ఆ సత్రానివే.

సత్రం నడిపిస్తున్న ఆయన కొంతకాలానికి వృద్ధుడైపోయాడు.అన్నం పెట్టీ పెట్టీ పున్నెం గడించాడు. అంతా రాముడికే వదిలేశాడు. నాలుగువేల ఎకరాల్లో అంగుళం కూడా ముట్టుకోలేదు. దేవుడే ఇచ్చిన గోచీపాతను కూడా వదిలేసి ఒక రోజు ఆయన ఆ దేవుడి దగ్గరకే వెళ్లిపోయాడు.

ఇప్పుడు భద్రాచలానికి రోడ్డు వచ్చింది. కొత్తగూడెం దాకా రైలూ వచ్చింది. ఇప్పుడు క్షణాల్లో భద్రాచలంలో వాలిపోవచ్చు. దేవుడిని చూసి వెళ్లిపోవచ్చు. ఆకలేస్తే అన్నం పెడతా అని పాడే హోటళ్లు వచ్చాయి . ఇప్పుడు గుడికి దారి కూడా మారిపోయింది. ఎవరూ పడవ దాటాల్సిన అవసరం లేదు. సత్రాన్ని కూడా అందరూ మరిచిపోయారు. సత్రం పాడుపడిపోయింది. గబ్బిలాల్లాంటి వాళ్లు వచ్చి చేరారు. నాలుగు వేల ఎకరాల్లో ఒక్క అంగుళం కూడా మిగల్లేదు. ఆ సత్రం పేరు చెబితే కూడా అదేమిటి అని అడిగేలా అయిపోయింది.

చాలా ఏళ్లయిన తరువాత ఈ మధ్యే కొన్ని సంవత్సరాల క్రితం ఆ సత్రాన్ని శృంగేరీ పీఠం తన అధీనంలోకి తీసుకుంది. శ్రీచక్ర సిమెంటు వారు దీనికి కావలసిన వనరులుసమకూరుస్తున్నారు. ఒక వేద పాఠశాల నడుస్తోంది. వేదవిద్యార్థులకు అక్కడ అన్నం దొరుకుతుంది. అంటే అన్నదాన యజ్ఞం మళ్లీ మొదలైందన్న మాట. ఆ సత్రం ముందు ఈ అన్నదాన యజ్ఞాన్ని ప్రారంభించిన వ్యక్తి విగ్రహం ఉంటుంది.

ఇంతకీ ఆయన పేరు చెప్పనే లేదు కదూ.

ఆయన పేరు పమిడిఘంటం వెంకటరమణ దాసు. 1850 లో పుట్టిన ఈయన ప్రకాశం జిల్లా నుంచి భద్రాచలం వచ్చాడు. ఇక్కడే జీవితమంతా గడిపేశాడు. ఆ సత్రం పేరు అంబ సత్రం.

తెలుగువాడు ఎప్పుడో ఒకప్పుడు భద్రాచలం చూడకపోడు. ఈ సారి రాముడిని, రామదాసును దర్శించుకున్నప్పుడు ఈ రమణదాసుని మరిచి పోకండి. కాస్త ఒపిగ్గా అడిగి అయినా సరే వెతుక్కుంటూ వెళ్లి అంబసత్రాన్ని చూడండి. ఎందుకంటే అక్కడ రెండు గుండిగలున్నాయి.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!