Tuesday, December 24, 2024
- Advertisement -spot_img
- Advertisement -spot_img

అచలం – అరుణం – అరుణాచలం …!!

పరమేశ్వరుని జ్యోతి స్వరూపంగా భావించడం మన శాస్త్ర ఏ సంప్రదాయం. ‘జ్యోతిర్లింగం’ అనడం ప్రసిద్ధి. అనంతమైన, ఆద్యంతరహితమైన తన జ్ఞానానంద స్వరూపాన్ని మహాగ్నిలింగంగా ప్రకటించిన పరమేశ్వర లీల కూడా ఆయనను కాంతిగానే తెలియజేస్తోంది.

 ఈ శివలీల జరిగిన చోటు ‘అరుణాచల క్షేత్రమని పురాణోక్తి.

మహాలింగంగా కనిపించి బ్రహ్మ మురారులకు సత్యతత్త్వాన్ని స్వయంగా మహాదేవుడు తెలియజేశాక, 

🪷ఆ అగ్ని స్తంభాకృతి ఒక మహా పర్వతంగా మారింది. అది కృతయుగంలో కేవలం జ్యోతిగా, త్రేతాయుగంలో స్వర్ణాద్రిగా, ద్వాపరంలో రజతాద్రిగా, కలిలో, శిలాకృతిగా గోచరిస్తుందని కొన్ని గ్రంథాల వివరణ.

మన కంటికి కొండగా కనబడినా దాని అసలు స్వరూపం చర్మచక్షువులు చూడలేని మహాజ్యోతి. ఆ విషయం ఎందరో సాధకులకు అనుభవం. పరమశివుని పంచలింగ క్షేత్రాలలో ఒకటిగా అగ్ని లింగంగా గా ప్రసిద్ది పొందిన క్షేత్రమిది.

🪷ఇక్కడ శివుడు మూడు ఆకృతులతో ఉంటాడని క్షేత్ర మాహాత్మ్యం చెబుతోంది. 

1) పర్వతాకృతి, 

2) అర్చనకై లింగాకృతి, 

3) అగోచరమైన దక్షిణామూర్తి.

 ఇది సిద్ధ క్షేత్రం.

 హిమాచల, శ్రీశైలాల తరువాత సిద్ధ పురుషులకు ఆవాసమైన తపోభూమి ఇదే. శైవ సంప్రదాయంలో, ద్రవిడ సంస్కృతిలో ఈ క్షేత్రానికి ప్రాధాన్యముంది.

🪷 భవ్యమైన ఆలయం దేశ వారసత్వ సంపదగానూ, మహోన్నత ఆధ్యాత్మిక శక్తిగానూ ఉంది. అపీతకుచాంబాసహిత అరుణాచలేశ్వరుడు ఎన్నో పరివార దేవతలతో కొలువైన దివ్య సామ్రాజ్యమిది. 

అగ్ని, జ్యోతి వంటి పదాలు మన వాజ్మయం జ్ఞాన ప్రకాశానికి వాడిన శబ్దాలు. అందుకే ఇది అనాదిగా జ్ఞాన క్షేత్రం.

🪷పురాణ ప్రశస్తి అటు ఉంచి చారిత్రకంగా కొన్నివేల యేళ్ల నుండి అనేక మంది జ్ఞానయోగులు ఈ క్షేత్రాన్ని కేంద్రంగా చేసుకొని, ఎందరినో సన్మారం వైపు నడిపారు. 

సాధువు మంగైయార్, పానిపత్రస్వామి, దక్షిణా మూర్తిస్వామి (ఈయనకు అరుణాచల స్వామి అని పేరు), అమ్మని అమ్మెయార్, ఇరైస్వామిగళ్, గుకైనమశ్శివయ్యార్ వంటి ప్రాచీన యోగులు

ఎందరో! ఆధునాతన కాలంలో ఆ కోవలోని వారే శ్రీ రమణ మహర్షి. 

🪷ఈ మహనీయుని ద్వారా అరుణాచల జ్యోతి విశ్వవ్యాప్తమయ్యింది. అసలు అరుణాచలం’ అనే పేరులోనే అద్భుతం ఉంది. అచలం’ అంటే కదలనిది, మార్పులేనిది అని అర్థం. 

అరుణం’ అంటే ఎఱ్ఱని కాంతి. కాంతి వ్యాపిస్తుంది. ఇది శక్తికి సంకేతం. ఈ శక్తి ఎవరిదో ఆతడు పరమాత్మ. అతడే పరంజ్యోతి.

🪷 “ జ్యోతి ‘ఆచలం’ గానే ఉంటుంది. దాని ‘కాంతి’ (అరుణం) అంతటా ప్రసరిస్తుంది. ఈ ప్రపంచమే అరుణాచలం. ఈ విశ్వశక్తికి మూలమైన పరమేశ్వరుడే ‘అచల జ్యోతి. ఆయన నుండి విశ్వమంతా నిండిన పరాశక్తియే ‘అరుణ. 

అందుకే అమ్మవారిని ‘సర్వారుణా ‘అరుణాం కరుణా తరంగితాక్షీం’ అని ప్రార్థిస్తాం. శివజ్యోతి కాంతియే శివశక్తి. రెండింటికీ భేదం లేదు. 

🪷అచలుని అరుణత్వమే కరుణ. “అరుణకరుణ” ఈ రెండూ ఒకటే. ఈశ్వర కారుణ్యమే శక్తి. ఆ శక్తి ప్రపంచంపై కురిసిన దయాకాంతి. జగతిని నడిపిస్తున్న ఆధారదీప్తి. 

ఆ వెలుగుల వెల్లువలోనే జీవులందరూ పోషణ పొందుతున్నారు. బ్రహ్మాండాలకు లోపలా వెలుపలా ఆ శివశక్తి ప్రకాశమే వ్యాపించి ఉంది. ఈ ‘నిజారుణ ప్రభాపూర మజ్జద్బహ్మాండ మండలా అని లలితా సహస్రనామాలలోని నామం ఈ భావాన్నే చెబుతున్నది. 

శివశక్తుల ఏక స్వరూపమే అరుణాచలం. పర్వత రూపంలో ఉన్న శ్రీచక్రమే ఈ అచలం అని పురాణాలు స్పష్టంచేశాయి. ఆ భావనతో శ్రద్ధతో ఆరాధించేవారికి శివశక్తుల అనుగ్రహం తథ్యం.

 “పేరుదలపగనే పట్టిలాగితివి, నీ మహిమ కనుదురెవరు అరుణాచలా! అరుణాచలమనుచు సురియించువారల

అహము నిర్మూలింపు అరుణాచలా! స్మరణ మాత్రముననే పరమముక్తి ఫలద కరుణామృత జలధి అరుణాచలమిది” అంటూ రమణులు తాదాత్మ్యంతో ఈ గిరిని కీర్తించి, ప్రదక్షిణ చేశారు. 

గిరి ప్రదక్షిణ ఒక గొప్ప యజ్ఞం, మహాయోగం, ఉత్కృష్ట తపస్సు. ఈ పర్వత పాదం చుట్టూ ఎన్నో దేవతామూర్తులు, ఋష్యాశ్రమాలు నేటికీ సామాన్య దృష్టికి అగోచరంగా, అసంఖ్యాకంగా ఉన్నాయి. ఇక పర్వత గుహలలో ప్రచ్ఛన్నంగా ఉన్న సూక్ష్మ శరీరులైన సిద్ధులు ఎందరో! “అరుణాచల శివ” అనే నామమే ఒక మహా మంత్రం. “స్మరణాత్ అరుణాచలం” స్మరించితే చాలు ముక్తినిచ్చే క్షేత్రమని పురాణోక్తి. “కరుణాసముద్రము గడ్డకట్టి పర్వతంగా మారితే అదే అరుణాచలం” అని రమణుల స్వానుభవ భావన. “గిరి రూపమైనట్టి కరుణా సముద్రా!” అని స్పష్టంగా ఆలపించారు. 

శ్రీ రమణయోగి. ‘తిరువడామలై”గా పేరొందిన ఈ క్షేత్రం ఎందరో నయనార్లకు స్ఫూర్తినిచ్చిన సంస్కృతి కేంద్రం. పేరులోనే విశ్వ రహస్యాన్ని, శివశక్తుల ఏకత్వాన్ని దాచుకున్న మహిమ ‘అరుణాచలం.’

అరుణాచలం కొండపేరు కాదు శివుని పేరే! ఆ శివుడు ధరించిన పర్వత రూపమే అరుణగిరి. దానినే “శోణాద్రి’ అని కూడా అంటారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!