జమ్మిగడ్డ స్మశాన వాటిక విషయంలో చివరకు న్యాయమే గెలుస్తుందనే నమ్మకంతో న్యాయం కోసం అవసరమైతే ఇంప్లిడ్ పిటిషన్ వేస్తానని జమ్మిగడ్డ స్మశాన వాటిక పరిరక్షణ కమిటీ
కన్వీనర్ తాడూరి గగన్ కుమార్ స్పష్టం చేశారు. కాప్రా మండల పరిధిలోని సర్వేనెంబర్ 199లో గతంలో స్టేడియం కోసం కేటాయించిన 12 ఎకరాల స్థల విషయం ప్రస్తుతం చిలుకమ్మ- మేడ్చల్ జిల్లా కలెక్టర్లు మధ్య కుషాయిగూడ లో ఉన్నటువంటి మేడ్చల్ జిల్లా కోర్టులో (కేసు నంబర్ ఏఎస్/45/2023) నడుస్తున్నదన్నారు. మొన్న ఈ మధ్య కాలంలో లోయర్ కోర్టులో (కేస్ నంబర్ పాత 197/2003, కొత్త ఓఎస్ 18/2022) చిలకమ్మ, ఇతర వ్యక్తులు వేసిన కేసును సుదీర్ఘంగా విచారణ తర్వాత 2023 ఆగస్టు 14న కోర్టు డిస్మిస్ చేసిందన్నారు. కేసు ఓడిపోయినప్పటికీ దీనిపై స్టే కోసం చిలకమ్మ, ఇతరులు 2023 ఆగస్టు 24న హైకోర్టుకు సంప్రదించారని తెలిపారు. దీంతో తాను హైకోర్టులో వాస్తవ పత్రాలతో కూడిన ఇంప్లిఎడ్ (డబ్ల్యూ పి 23522/2023 పిటిషన్ 2023 ఆగస్టు 31న సమర్పించడం జరిగిందన్నారు. దీంతో స్టే ఆగిపోవడం, ఆ తదునాంతరం వారు కేసును 2024 జనవరి 2న స్టే కోసం వెళ్లిన చిలకమ్మా, ఇతరులు కేసును విత్ డ్రా చేసుకున్నారని తెలిపారు. జిల్లా కోర్టులో ప్రస్తుతం చిలకమ్మా, ఇతరుల ఆపిల్ సూట్ (ఏఎస్/45/2023) కేసు ప్రకారం ఇట్టి స్థలం యధావిధిగా ఉండేందుకు 2024 ఫిబ్రవరి 29న స్టేటస్కో (యధావిధిగా ఏలాంటి నిర్మాణాలు జరగకుండా ఉండాలని) ఆదేశించినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా, దీని పై మంగళవారం కేసు విచారణ ఉండగా రెవెన్యూ, జిహెచ్ఎంసి తరపు న్యాయవాదులు పైన తెలిపిన భూమి ప్రభుత్వ భూమి అని మరోసారి జిల్లా కోర్టులో కౌంటర్ ఫైల్ దాఖలు చేయగా జడ్జి ఇట్టి కేసును సెప్టెంబర్ మూడవ తేదీకి వాయిదా వేశారు. అలాగే స్టేటస్కో ను కచ్చితంగా ఇరువురు పాటించాలని, ఎవరు కూడా ఉల్లంఘించడానికి అవకాశం లేదని, ఎలాంటి నిర్మాణాలు జరగవద్దని ఆదేశించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. స్టేటస్కో కన్నా ముందు కాప్రా రెవిన్యూ కార్యాలయ అధికార సిబ్బంది పై తెలిపిన సర్వేనెంబర్ 199లోని ప్రభుత్వ భూమి స్టేడియం ల్యాండ్ ను ఇందులో అంతర్భాగమైన స్మశాన వాటిక స్థలంను తిరిగి మరోసారి జిహెచ్ఎంసి కాప్రా కార్యాలయానికి ప్రస్తుతం మిగిలి ఉన్న 9 ఎకరాల 22 గుంటల స్థలాన్ని ఈ సంవత్సరం జనవరి 24న లొకేషన్స్, స్కెచ్ మ్యాప్ తో సహా అప్పజెప్పిందన్నారు. ప్రభుత్వ భూమి రక్షణ కోసం జిహెచ్ఎంసి ద్వారా ఈ సంవత్సరం జనవరి 6న పొందిన టెండర్ లో భాగంగా కంచె వేయాల్సిన పనులు స్టేటస్కో రాకముందు దాదాపు 20 రోజులు ఉన్నప్పటికీ జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ అధికారుల నిర్లక్ష్యంతో ఆగి పోయినదన్నారు. ప్రభుత్వ తరపు న్యాయవాదులు ప్రభుత్వ భూమి కాపాడే క్రమంలో కోర్టులో ఉన్న స్టేటస్కో ఎత్తివేసే సమయానికి ఎంత భూమి మిగిలి ఉంటుందో వేచి చూడాల్సిన అవసరం ఉందన్నారు. ఏది ఏమైనా కోర్టు ఇచ్చిన తదుపరి వాయిదా వరకు ఎదురుచూస్తున్నానని అన్నారు.