నెల్లూరులో ఉద్రికత్త నెలకొంది. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని గృహనిర్బంధం చేసేందుకు పోలీసులు యత్నించారు. నెల్లూరులోని మాగుంట లేఅవుట్‌లో ఉన్న కోటంరెడ్డి కార్యాలయాన్ని పోలీసులు చుట్టుముట్టారు.. తెదేపా నిర్వహించే శాంతియుత ర్యాలీకి వెళ్లకుండా నిలువరించేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. పోలీసుల రాక తెలిసిన కోటంరెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లారు. దీంతో బృందాలుగా ఏర్పడిన పోలీసులు కోటంరెడ్డి కోసం గాలిస్తున్నారు. మరోవైపు ఎలాగైనా సరే వీఆర్‌సీ కూడలికి వెళ్లేందుకు కోటంరెడ్డి ప్రయత్నిస్తున్నారు..
తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ తెదేపా, జనసేన, సీపీఐ పార్టీలు శాంతియుత ర్యాలీకి పిలుపునిచ్చాయి. బుధవారం సాయంత్రం 4 గంటలకు నెల్లూరులోని వీఆర్‌సీ కూడలి నుంచి గాంధీ బొమ్మ కూడలి వరకు ఈ ర్యాలీ జరగాల్సి ఉంది. అయితే, ర్యాలీకి అనుమతి లేదంటూ పోలీసులు ఉదయం నుంచే ముఖ్య నాయకులను గృహనిర్బంధాలు చేస్తున్నారు. తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, పలువురు నాయకులను గృహనిర్బంధం చేశారు. ఈ క్రమంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని కూడా గృహనిర్బంధం చేసేందుకు పెద్ద ఎత్తున పోలీసులు ఆయన ఇంటికి చేరుకున్నారు. అయితే, అక్కడ ఎమ్మెల్యే లేకపోవడంతో ఆయన ఆచూకీ తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు..